తేదేపా నేత దారుణ హత్య

Posted on : 13/03/2018 12:27:00 pm

తెలంగాణలో మహిళా టీడీపీ నేత హత్యోదంతం ఆ ప్రాంతంలో తీవ్రకలకలం రేపింది. ఇంట్లో నిద్రిస్తోన్న  ఆమె పై దుండగులు దాడిచేసి దారుణంగా హత్యచేసిన ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో చోటుచేసుకుంది. కాటారం మండలం తెలుగు మహిళా అధ్యక్షురాలు రామిల్ల కవిత (30)ను ఆదివారం రాత్రి ఆమె ఇంట్లోనే కిరాతకంగా హత్య చేశారు. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం కొత్తపల్లి గ్రామానికి చెందిన కవిత విభేదాల కారణంగా పదేళ్ల కిందటే భర్త నుంచి విడిపోయి తన ఇద్దరు కుమార్తెలు శ్రీజ (15), శిరిణి (14)లతో కలిసి ఉంటోంది. మంథనిలో ఆదివారం బంధువుల ఇంట్లో వివాహానికి కవిత తన పిల్లలతో కలిసి వెళ్లారు. వేడుకల అనంతరం వధువుకు తోడుగా తన చిన్న కుమార్తె శిరిణిను పంపి, పెద్ద కుమార్తె శ్రీజతో ఇంటికి చేరుకున్నారు. అర్ధరాత్రి ఇంట్లోకి చొరబడిన దుండుగులు కవితపై హత్యాయత్నం చేస్తుండగా దీన్ని అడ్డుకునే ప్రయత్నం చేసిన శ్రీజ కాళ్లు, చేతులు కట్టేసి మరో గదిలో బంధించారు. అంతేకాదు కేకలు వేస్తే పాపను కూడా చంపేస్తామని బెదిరించిన దుండగులు తన కళ్లముందే కన్నతల్లిని హతమార్చిన ఘటన స్థానికుల చేత కూడా కంట తడి పెట్టించింది. దుండగులు కత్తిపీటతో కవితపై దాడిచేసి హతమార్చినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసిన పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.